దీర్ఘకాలిక COVID అంటే ఏమిటి?
COVID-19 ఇన్ఫెక్షన్కి గురైన వ్యక్తులకు ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత రోగలక్షణాలు కొనసాగవచ్చు అలాగే వాళ్లు దీర్ఘకాలిక దుష్ప్రభావాలకు గురికావచ్చు, అలాంటి పరిస్థితిని “దీర్ఘకాలిక COVID” లేదా “పోస్ట్-COVID సిండ్రోమ్” అని అంటారు. దీర్ఘకాలిక COVID గురించి ఇప్పటికీ చాలా విషయాలు తెలియవు. దీర్ఘకాలిక COVID మీద పరిశోధన కొనసాగే కొద్దీ దాని గురించి మరిన్ని విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం.
దీర్ఘకాలిక COVID రోగలక్షణాలు
దీర్ఘకాలిక COVIDతో బాధపడేవాళ్లలో ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత అనేక వారాలు, నెలలు లేదా ఏళ్లు కొనసాగే రోగలక్షణాలు కనిపించవచ్చు.
రోగలక్షణాల్లో ఇవి కూడా భాగమే కానీ, వీటికే పరిమితం కావు:
- ప్రత్యేకించి, మానసికంగా లేదా శారీరకంగా ప్రయాసపడ్డాక అలసటగా అనిపించడం
- జ్వరం
- శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
- దగ్గు
- ఛాతి నొప్పి
- వాసన మరియు/లేదా రుచిలో మార్పు
- ఆలోచించడం లేదా ధ్యాసపెట్టడం కష్టంగా మారడం లేదా “బ్రెయిన్ ఫాగ్”
- తలనొప్పి
- కడుపు నొప్పి
- రుతుచక్రంలో మార్పులు
దీర్ఘకాలిక COVID ఎవరికి రావచ్చు?
COVID-19 ఇన్ఫెక్షన్కి గురైన ఎవరికైనా దీర్ఘకాలిక COVID రావచ్చు. తీవ్రమైన COVID-19 రోగలక్షణాలు కనిపించినవాళ్లలో, ప్రత్యేకించి హాస్పిటల్లో చేరాల్సి వచ్చినవాళ్లలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. COVID-19 ఇన్ఫెక్షన్ సమయంలో లేదా ఆ తర్వాత, మల్టీసిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ వచ్చినవాళ్లకు దీర్ఘకాలిక COVID వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉండవచ్చు. మహిళలకు, వయోవృద్ధులకు, బయటికి కనిపించని అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్లకు, వ్యాక్సిన్ వేయించుకోనివాళ్లకు దీర్ఘకాలిక COVID వచ్చే అవకాశం ఎక్కువ. అనేకసార్లు COVID-19 వచ్చినవాళ్లకు కూడా దీర్ఘకాలిక COVIDతో సహా అనేక ఆరోగ్య సమస్యలు రావచ్చు.
దీర్ఘకాలిక COVIDను నిరోధించడం
COVID-19ను నిరోధించడమే దీర్ఘకాలిక COVIDను నిరోధించడానికి అత్యంత ఉత్తమమైన మార్గం. చేతులు కడుక్కోవడం, జనం ఉండే చోట మాస్కులు ధరించడం, అనారోగ్యంగా ఉన్నప్పుడు ఇంట్లోనే ఉండడం మరియు సిఫారసు చేసిన వ్యాక్సిన్లు మరియు బూస్టర్ డోసులు తీసుకోవడం ద్వారా COVID-19 నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి అలాగే ఇతరులను రక్షించండి.
వ్యాక్సిన్ వేయించుకోనివాళ్లతో పోలిస్తే, వ్యాక్సిన్ వేయించుకున్నా COVID-19 వచ్చేవాళ్లకు దీర్ఘకాలిక COVID వచ్చే అవకాశాలు తక్కువ.
COVID-19 కోసం వ్యాక్సిన్ పొందడం గురించి తెలుసుకోండి
దీర్ఘకాలిక COVIDను గుర్తించడం
దీర్ఘకాలిక COVIDను గుర్తించడం కష్టం కావచ్చు. రోగలక్షణాల గురించి వివరించడం రోగులకు కష్టంగా ఉండవచ్చు. దీని రోగనిర్ధారణ కోసం ల్యాబ్ టెస్ట్ లేదా ఇమేజింగ్ స్టడీ అందుబాటులో లేదు. రోగికి దీర్ఘకాలిక COVID ఉన్నా, వైద్య పరీక్షల్లో సాధారణ ఫలితాలే రావచ్చు.
దీర్ఘకాలిక COVID రోగలక్షణాలు ఉన్నట్లు చెప్తున్న కొందరికి COVID-19 వచ్చిన ప్రారంభంలో రోగలక్షణాలు కనిపించలేదు అలాగే వాళ్లు COVID-19 కోసం పరీక్ష చేయించుకోలేదు. దీనివల్ల, వారికి గతంలో COVID-19 వచ్చినట్లు నిర్ధారించడం కష్టమవుతుంది. దానివల్ల దీర్ఘకాలిక COVID ఉన్నట్లు నిర్ధారించలేకపోతున్నారు లేదా దాని నిర్ధారణ ఆలస్యమవుతుంది. మీకు దీర్ఘకాలిక COVID వచ్చినట్లు ఎప్పుడైనా నిర్ధారించాలంటే, మీకు ఒంట్లో బాగోలేదు అని అనిపించగానే COVID-19 కోసం పరీక్ష చేయించుకోవడం చాలా ముఖ్యం.
రోగి కోసం సలహాలు: COVID- తర్వాతి పరిస్థితుల కోసం ఆరోగ్య సంరక్షణ ప్రొవైడర్ అపాయింట్మెంట్లు (ఇంగ్లీషులో)
కొత్త మరియు ఇప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యలు
COVID-19 ఇన్ఫెక్షన్ అనేక అవయవ వ్యవస్థలను ప్రభావితం చేయవచ్చు మరియు దీర్ఘకాలిక COVIDలో పాత్ర పోషించగల ఆటోఇమ్యూన్ పరిస్థితులు ఏర్పడేలా కూడా కొన్నిసార్లు ప్రేరేపించవచ్చు. శరీర రోగనిరోధక వ్యవస్థ శరీరంలోని ప్రభావిత భాగాల్లో వాపు వచ్చేలా చేసినప్పుడు లేదా కణజాలలకు హాని కలిగించినప్పుడు ఆటో ఇమ్యూన్ పరిస్థితులు ఏర్పడవచ్చు. అంటే, గతంలో COVID-19 వచ్చినవాళ్లలో మధుమేహం లేదా గుండె సమస్యల లాంటి కొత్త ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇప్పటికే మధుమేహం, గుండె జబ్బు లాంటి ఆరోగ్య సమస్యలు ఉంటే అవి COVID-19 సోకిన తర్వాత మరింత అధ్వాన్నంగా మారవచ్చు.
దీర్ఘకాలిక COVID, వైకల్యం హక్కులు
దీర్ఘకాలిక COVID వల్ల శారీరక, మానసిక వైకల్యాలు రావచ్చు, Americans with Disabilities Act (ADA, అమెరికన్స్ విత్ డిసేబిలిటీస్ యాక్ట్) ప్రకారం, దీర్ఘకాలిక COVIDను కూడా వైక్యలంగా పరిగణిస్తారు. వైకల్యం కారణంగా ఎదురయ్యే వివక్ష నుండి దీర్ఘకాలిక COVID ఉన్నవాళ్లకు చట్టం రక్షణ కల్పిస్తుంది. దీర్ఘకాలిక COVID-సంబంధిత పరిమితులకు సరిపోయేలా వ్యాపారాల, రాష్ట్ర మరియు స్థానిక ప్రభుత్వాల నుండి సహేతుకమైన సవరణలు పొందే హక్కు కూడా వాళ్లకు ఉండవచ్చు.
గైడెన్స్ ఆన్ “లాంగ్ COVID” యాజ్ ఏ డిసేబిలిటీ అండర్ ది ADA (ఇంగ్లీషులో)
దీర్ఘకాలిక COVID మరియు గర్భధారణ
గర్భవతులు లేదా ఇటీవల గర్భం ధరించిన వారు COVID-19 కారణంగా తీవ్రంగా జబ్బుపడే అవకాశం ఉంది. COVID-19 కారణంగా, గర్భధారణ మరియు గర్భంలో పెరుగుతున్న శిశువు మీద ప్రభావం చూపగల సమస్యలు ఎదురుకావచ్చు.
దీర్ఘకాలిక COVID గర్భధారణ మీద ఎలా ప్రభావం చూపగలదనే దాని గురించి ఇప్పటికీ చాలా విషయాలు తెలియవు. గర్భవతిగా ఉన్నప్పుడు COVID-19కి గురైన మహిళలమీద, వారి పిల్లల మీద COVID-19 దీర్ఘకాలిక ప్రభావాల గురించి National Institutes of Health (NIH, ది నేషనల్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్) (ఇంగ్లీషులో) వారు 4-ఏళ్ల అధ్యయనం చేయనున్నారు.
దీర్ఘకాలిక COVID మరియు యువత
దీర్ఘకాలిక COVID వల్ల యువతీయువకులు కూడా జబ్బుపడవచ్చు. అలసట, ఏకాగ్రత చూపలేకపోవడం లాంటి దీర్ఘకాలిక COVID రోగలక్షణాలు ఉన్న యువతీయువకులకు పాఠశాలలో, ఇతర కార్యకలాపాల్లో పాల్గొనడం కష్టంగా అనిపించవచ్చు. చిన్న పిల్లలకు తమ రోగలక్షణాల గురించి చెప్పడం కష్టంగా ఉండవచ్చు.
దీర్ఘకాలిక COVID ఉన్న పిల్లలు, 2 ఫెడరల్ చట్టాల (ఇంగ్లీషులో) ప్రకారం ప్రత్యేక విద్య, రక్షణలు లేదా సంబంధిత సేవలు పొందడానికి అర్హులు కావచ్చు.
COVID-19 కోసం యువతీయువకులు వ్యాక్సిన్ వేయించుకోవడమనేది దీర్ఘకాలిక COVIDను నిరోధించడానికి అత్యంత ఉత్తమమైన మార్గం.
యువతకు వ్యాక్సిన్ వేయించడం గురించి మరింత తెలుసుకోండి.
వైద్యుల కోసం సమాచారం
- రికవర్: రీసెర్చింగ్ COVID టు ఎన్హాన్స్ రికవరీ (ఇంగ్లీషులో): దీర్ఘకాలిక COVID మీద జరిగే పరిశోధనకు చేయూతనిచ్చేలా National Institutes of Health (NIH) రూపొందించింది.
- COVID-తర్వాత పరిస్థితులు: ఆరోగ్య సంరక్షణ ప్రొవైడర్ల కోసం సమాచారం (ఇంగ్లీషులో): Centers for Disease Control and Prevention (CDC, సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్) ఆరోగ్య సంరక్షణ ప్రొవైడర్ల కోసం రూపొందించిన సారాంశం.
- COVID-తర్వాతి పరిస్థితులు: CDC సైన్స్ (ఇంగ్లీషులో) దీర్ఘకాలిక COVID సైన్సుకి సంబంధించిన సారాంశం మరియు COVID-తర్వాతి పరిస్థితుల మీద క్లినికల్ వెబినార్లకు లింక్లు.